ఈ జాతర గురించి మీకు తెలియని నిజాలు
(పెద్దగట్టు /గొల్లగట్టు)
తెలంగాణలో ప్రఖ్యాతి చెందిన జాతర్లలో రెండవదైన పెద్దగట్టు/గొల్లగట్టు జాతరకు దురాజపల్లి ముస్తాబవుతుంది. గజ్జెల లాగులు , భేరి చప్పుళ్లతో శివసత్తులు ఇక్కడ సందడి చేయనున్నారు. లింగమంతుల స్వామి వారికీ బోనాలు సమర్పించడానికి , మేకలు,గొర్రెపోతులు బలి ఇవ్వడానికి దాదాపు నలభై లక్షల మంది ఫై చిలుకు భక్తులు వస్తారు.
బోళా శంకరుడైన పరమశివుని దర్శనానికి ఎదురుచూస్తున్న వేళ , అయన జాతర జరుగుతున్న సమయం ఆసన్నం కావటం వలన అందరు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు. కావున క్రొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా దురాజపల్లిలోని పెద్దగట్టులో వెలసి ఉన్న లింగమంతుల స్వామి జాతరంటే జన జాతరని తలపిస్తుంది. ఈ జాతర పేరుకే యాదవుల ఆరాధ్యదైవమైన అన్ని వర్గాల వారూ ఇక్కడకి వస్తారు ప్రతి రెండేండ్లకొకసారి (ఈ సారి ఫిబ్రవరి 12-16)జరుగుతుంది .
పురాతన చరిత్ర
కొన్ని శతాబ్దాల క్రితం చోళ చాళిక్యుల (యాదవ్ రాజులు ), కాకతీయులు ఛివ్వేంల మండలం వల్లభాపురం పరిధిలోని ఉండ్రుగొండ గుట్టలను కేంద్రంగా చేసుకొని పరిపాలించారు . వీరు ఉండ్రుగొండ గుట్టలలో శివుడు , లక్ష్మి నరసింహ్మ స్వామి , లింగమంతుల స్వామి , చౌడమ్మ (స్వామి చెల్లెలు)దేవాలయాలతో పాటు మరికొన్ని గుళ్లను నిర్మించారట. అప్పట్లోనే ఈ గుట్టల్లో లింగమంతుల స్వామి , చౌడమ్మల జాతర అంగరంగా వైభవంగా జరిగేదట. ఎతైన కొండలలో కొలువై ఉన్న లింగమంతుల స్వామికి మొక్కులు చెల్లించుకునేందుకు ఓ నిండు శూలాలు బోనం , పూజ సామాగ్రితో కలగలిపిన మందగాపను ఎత్తుకొని గుట్టపైకి ఎక్కుతుండగా కాలు జారీ క్రింద పడి చనిపోయిందట. దీనితో లింగమంతులస్వామి భక్తులకు దగ్గరలో ఉండేందుకు అక్కడకి సమీపంలోని ఉన్న పాలచెర్లయ్య గట్టు (ప్రస్తుత పెద్దగట్టు) మీద వెలుస్తానంటు భక్తులకు పూనకంలో చెప్పాడంట. కాకతీయులతో యుద్ధం తరువాత ఇక్కడకు వచ్చిన వైష్ణవ రాజులు గుట్టపై ఉన్న విగ్రహాలను సమీపంలోని బావి పడవేసినట్లు చెబుతారు.
స్వామి పెద్దగట్టు ఎలా చేరాడు
ఛివ్వేంల మండలం గుంపుల సూర్యాపేట దగ్గరి కేసారమునకు చెందిన పశువుల కాపర్లు ఒక రోజు పశువులను మేపుతూ విశ్రాంతి తీసుకుంటున్నారట.లింగమంతులస్వామి వాళ్ళ కలలోకి వచ్చి తాను గుట్టకు సమీపంలో ఉన్న బావిలో ఉన్నానని తనను పాలచెర్లయ్య గట్టు మీద ప్రతిష్టింపచేయాలని చెప్పాడట . పశువుల కాపర్లు స్వామి చెప్పిన విధంగా విగ్రహాలు తెచ్చేందుకు బావిని త్రవ్వటం ప్రారంభించారట. అలా తవ్వేటప్పుడు లింగమంతుల స్వామి విగ్రహానికి గునపం తగిలి ఫై భాగంలో కాస్త దెబ్బతిందట. అది ఇప్పటికి స్పష్టంగా కనిపిస్తుంది. లింగమంతులస్వామితో పాటు , చౌడమ్మ, మాణిక్యమ్మ , ఆకుమంచమ్మా . యలమంచమ్మా, గంగమ్మ దేవతామూర్తులు అక్కడే దొరికాయట. కాబట్టి ఆ విగ్రహాలను సంబరంగా గట్టు మీదకి చేర్చారు. అప్పటినుంచి ఆచారబద్దంగా ప్రతి రెండు సంహాత్సరాలకొసారి ఐదు రోజుల పాటు పెద్దగట్టు (గొల్లగట్టు) జాతర జరపబడుచుంది.
జాతర :-
జాతరకు వచ్చిన భక్తులు స్వామికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. జాతరకు పదియేను రోజుల ముందే దిష్టి కార్యక్రమం నిర్వహించడంతో ఇక్కడి తంతు మొదలవుతుంది. మాఘమాసంలో మొదటి ఆదివారం నాడు కేసారం గ్రామం నుండి యాదవులైన మెంతబోయిన వంశం వారు , గుంపుల గ్రామం నుంచి మున్న ,గొర్ల వంశాల వాళ్ళు దేవర పెట్టెను వేడుకగా గుట్టకు చేర్చుతారు. చిన్న చిన్న దేవత ప్రతిమాలుండే ఈ పెట్టె కేసారంలో ఉంటుంది. ఈ విగ్రహాలలో ఉండే అందనపు చౌడమ్మను ప్రత్యేకంగా పూజిస్తారు. అనంతరం హక్కు దార్లు (మెంతబోయిన ,గొర్ల వంశాల వారు ) తీసుకొచ్చిన బియ్యం ఉడికించి రెండు బోనాలను తాయారు చేస్తారు. పసుపూ , కుంకుమా నిమ్మకాయలతో చంద్రపట్నం వేసి దిష్టి కుంబాలను రెండు రాశులుగా పోస్తారు . ఈ సందర్భంగా బైకానులు వచ్చి యాదవ రాజుల కథలు చెబుతు పూజలు నిర్వహిస్తారు . మరుసటి రోజు దేవత ప్రసాదంగా భక్తులకు భోజనాలు ఏర్పాటుచేస్తారు. తరువాత అదే రోజు సాయంత్రం అందనపు చౌడమ్మను ఊరేగిస్తూ కేసారం గ్రామానికి చేరుస్తారు.
దిష్టి పూజ అనంతరం 15 రోజులకు వచ్చే మాఘ పౌర్ణమి తరువాతి ఆదివారం రాత్రి మల్లి కేసరంనుండి దేవర పెట్టెను తేవడంతో జాతర ఆరంభమవుతుంది మంగళవారం రోజు చంద్రపట్నం కార్యక్రమం నిర్వహించి స్వామి కళ్యాణం చేస్తారు. తరువాత రోజు బోనం కుండల్లో పాలు పొంగించి స్వామికి పూజలు నిర్వహిస్తారు. చౌడమ్మ తల్లికి సాంప్రదాయ మొక్కును చెల్లిస్తారు.అనంతరం దేవర పెట్టెను ఊరేగింపుతో కేసారం గ్రామానికి తరలిస్తారు.
ఇక్కడకు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఒరిస్సా , మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తిస్గడ్ తదితర రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఇక్కడకు వస్తారు.
సూర్యాపేట జిల్లా నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో వెలసిన లింగమంతులస్వామి జాతీయ రహదారి 65 వెంట దురాజపల్లి గ్రామం వద్ద పెద్దగట్టు ఉంటుంది.
ఇక్కడకు రావడానికి మిర్యాలగూడ,కోదాడ,విజయవాడ రహదారులు కలిసి ఉంటాయి.
Recent Comments