తెలుగు రాష్ట్రాల్లోనరసింహస్వామి క్షేత్రాలెన్నో ఉన్నాయి. వీటిలో ఎక్కువగా దట్టమైన అడవులు, ఎత్తైన కొండల మీదే నిర్మితమయ్యాయి. ఉండ్రుగొండ నరసింహస్వామి దేవాలయం కూడా ఈ కోవకే చెందింది. అయితే, ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగానే కాకుండా చారిత్రకంగానూ ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 10 కి.మీ. దూరంలో ఉన్న ఉండ్రుగొండ కోట చారిత్రక అంశాలకు, శిల్పకళా సంపదకు నెలవుగా ఉన్నది. ఎనిమిది కొండలను కలుపుతూ వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి రమణీయతతో, సుందర దృశ్యాలతో అలరారుతున్నది. ఉండ్రుగొండ కోటను కేంద్రంగా చేసుకొని ఎంతోమంది రాజులు పాలించారు. ఇక్కడి గిరిదుర్గం 9వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు కళ్యాణి చాళుక్యులు, కుందూరు చోళులు, రేచెర్ల నాయకుల ఆధీనంలో.. 13వ శతాబ్దంలో కాకతీయులు, 14వ శతాబ్దంలో గజపతిరాజులు, 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల ఏలుబడిలో ఉన్నది. ఇన్ని శతాబ్దాల పాలనా విశేషాలకు ఇక్కడి కట్టడాలు, ప్రాకారాలు, శిల్పాలు, శాసనాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కోటలోని ప్రతి ప్రాకారంలోనూ, కట్టడంలోనూ ఆనాటి రాజుల పాలనా వైభవం, దర్పం కండ్లకు కట్టినట్టుగా కనిపిస్తాయి.
అద్భుతం.. రాతి మంటపం
కోట పైభాగంలోని వంపు ప్రదేశంలో నిర్మితమైన రాతి మంటపం అత్యద్భుతంగా ఉన్నది. మంటప నిర్మాణంలో ఉపయోగించిన స్తంభాలను అతికించడానికి ఎటువంటి మిశ్రమం వాడకుండా ఒక స్తంభంపై మరో స్తంభం నిలబెట్టిన విధానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎత్తయిన కొండలమీద శిలలను తొలిచి, అందమైన రాతి శిల్పాలుగా మలచడానికి వారు పడిన కఠిన శ్రమ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది.
గధేగల్ శాసనం
ఉండ్రుగొండ కోటలో వివిధ పాలకులు వేయించిన శాసనాలు ఇప్పటివరకు 12 లభ్యమయ్యాయి. ఇందులో కొన్ని లేబుల్ శాసనాలతోపాటు గధేగల్ శాసనం కూడా ఉన్నది. కోటలోని ప్రవేశ ద్వారానికి సమీపంలో గోడపైన తెలుగు రాష్ర్టాల్లోనే అరుదైన గధేగల్ శాసనం దర్శనమిస్తుంది. దీనికో ప్రత్యేకత ఉంది. తీవ్రమైన తప్పులు చేసినవారిని ఇక్కడ గాడిదలతో కాపురం చేయించేవారట! ‘గధేగల్’ అన్న పేరు రావడానికి కూడా కారణం ఇదే.
ప్రస్తుతం శిథిలావస్థలో ఎంతో వైభవాన్ని చూసిన ఈ కోట, తన ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయింది. ప్రత్యర్థి సైన్యాల దాడిని తట్టుకునేలా నిర్మితమైన రాతిగోడ, మట్టిగోడ, కందకం, బురుజులు, ఇతర కట్టడాలు నామరూపాల్లేకుండా పోయాయి. 11 కిలోమీటర్ల మేర విస్తరించిన ఉండ్రుగొండ గిరిదుర్గంలో 30 వరకూ దర్శనీయ స్థలాలున్నాయి. ఆధ్యాత్మిక, పర్యావరణ, సాహసక్రీడల కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కావలసిన వనరులు గిరి దుర్గానికి పుష్కలంగా ఉన్నాయి.
పర్యాటక ఆకర్షణలు
- కోట పైభాగంలోని కొలనులు
- మంత్రిగారి బావి
- చాకలి బావి
- రాజ దర్బార్
- కొలివి చావిడి
- శివాలయం
- వేణుగోపాలస్వామి ఆలయం
- మూల దర్వాజ
- ఏనుగుల దర్వాజ
- రాతిపై చెక్కిన శంఖచక్రాలు
- హనుమంతుని విగ్రహాలు
- భైరవుని విగ్రహాలు
Recent Comments